ఆనవాయితీలు, ఆత్మీయతలు, ఆరోగ్య రహస్యాల సమ్మేళనం.. కనుమ నాటి కట్టుబాట్లు ఇవే!

సంక్రాంతి సంబరాల్లో చివరి రోజు కనుమ(Kanuma) పండుగ. పశువులను అలంకరించి కృతజ్ఞత చాటుకోవడం, పితృదేవతలకు నైవేద్యం సమర్పించడం, కుటుంబంతో కలిసి విందు భోజనం చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ప్రకృతి, బంధాలు, సంప్రదాయాలను కలిపే గొప్ప తెలుగు పండుగ కనుమ.

Kanuma Festival Significance and Traditions in Telugu Culture
Kanuma Festival Significance and Traditions in Telugu Culture

Kanuma

  • కనుమ(Kanuma) సంక్రాంతి పండుగలో చివరి రోజు, పశువుల పట్ల కృతజ్ఞత చాటుకునే విశిష్ట పండుగ.

  • ఈ రోజున పశువులను అలంకరించడం, పితృదేవతలకు నైవేద్యం సమర్పించడం, కుటుంబంతో కలిసి విందు భోజనం చేయడం ఆనవాయితీ.

  • కనుమ రోజు ప్రయాణాలు చేయకుండా బంధుమిత్రులతో గడపాలనే సామాజిక భావన బలంగా ఉంది.

హైతరాబాద్: తెలుగువారి లోగిళ్లలో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి సంబరాల్లో చివరిది, అత్యంత విశిష్టమైనది ‘కనుమ(Kanuma)’. భోగి మంటల వెచ్చదనంతో మొదలై, సంక్రాంతి సందడితో ఉరకలేసి, చివరకు కనుమ వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ రోజును ప్రధానంగా ‘పశువుల పండుగ’గా జరుపుకోవడం మన సంప్రదాయం. మనిషికి చేదోడు వాదోడుగా నిలిచే మూగజీవాల పట్ల కృతజ్ఞత చాటుకునే గొప్ప సందర్భమిది.

పశువుల అలంకరణ : కనుమ (Kanuma)రోజున పల్లెల్లో దృశ్యాలు కనులవిందుగా ఉంటాయి. తెల్లవారుజామునే పశువులను నదీ తీరాలకు లేదా చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగి స్నానం చేయిస్తారు. అనంతరం వాటి కొమ్ములకు రంగులు అద్ది, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. మెడలో గజ్జెల పట్టీలు, కాళ్లకు మువ్వలు కట్టి, రంగు రంగుల రిబ్బన్లు, పూలదండలతో పశువులను పెళ్లికూతురులా ముస్తాబు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, ఎద్దుల పోటీలు నిర్వహిస్తూ పల్లెల్లో పండుగ వాతావరణాన్ని ఉరకలేయిస్తారు.

Kanuma 
Kanuma

విందు భోజనాలు: కనుమ పండుగలో మరో ప్రధాన ఘట్టం పితృదేవతల స్మరణ. చనిపోయిన మన పెద్దలు ఈ రోజున మనల్ని ఆశీర్వదించడానికి వస్తారని ప్రజల నమ్మకం. అందుకే వారికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆంధ్రప్రాంతంలో ఈ రోజున మాంసాహారం ఆరగించడం ఒక ఆనవాయితీ. అందుకే దీనిని ‘ముక్కనుమ’ అని కూడా పిలుస్తారు. గారెలు, మాంసం కూర వండుకుని, ఇంటికి వచ్చిన కూతుళ్లు, అల్లుళ్లు, బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేయడం ఒక మధురమైన అనుభూతి. మాంసాహారం తీసుకోని వారు మినుములతో చేసిన గారెలను తప్పనిసరిగా తీసుకుంటారు. శీతాకాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడానికి మినుములు ఎంతో మేలు చేస్తాయి.

ప్రయాణాల నియమం : కనుమ(Kanuma) రోజు కాకి కూడా కదలదు అనే సామెత మనందరికీ తెలిసిందే. పండుగకు వచ్చిన వారు అదే రోజున వెళ్ళిపోకుండా, అందరూ కలిసి ఆ రోజంతా ఆనందంగా గడపాలనేది దీని వెనుక ఉన్న సామాజిక ఉద్దేశ్యం. కనుమ రోజున ప్రయాణం చేస్తే కార్యసిద్ధి జరగదని, ఆటంకాలు ఎదురవుతాయనే నమ్మకం కూడా బలంగా ఉంది. అందుకే ఈ రోజున ఎవరూ ఊరు దాటి వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటూ ఆత్మీయులతో కాలాన్ని గడుపుతారు. ఇలా ప్రకృతిని, పశువులను, బంధాలను కలుపుతూ సాగే కనుమ పండుగతో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగుస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1: కనుమ పండుగను ఎందుకు పశువుల పండుగగా జరుపుకుంటారు?

A: వ్యవసాయం, జీవనోపాధిలో కీలక పాత్ర పోషించే పశువుల పట్ల కృతజ్ఞత తెలుపుతూ కనుమను పశువుల పండుగగా జరుపుకుంటారు.

Q2: కనుమ రోజున మాంసాహారం ఎందుకు చేస్తారు?

A: శీతాకాలంలో శరీరానికి శక్తి, వేడి అందించడానికి మాంసాహారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే దీనిని ‘ముక్కనుమ’ అని కూడా అంటారు.

Q3: కనుమ రోజున ప్రయాణం చేయకూడదనే నమ్మకం ఎందుకు ఉంది?

A: పండుగకు వచ్చిన వారు కుటుంబంతో కలిసి పూర్తి రోజంతా గడపాలనే ఉద్దేశంతో పాటు, ఈ రోజున ప్రయాణం చేస్తే ఆటంకాలు వస్తాయని సంప్రదాయ నమ్మకం ఉంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »