Coriander at Home
-
చిన్న కుండీ లేదా కిటికీ దగ్గరే రసాయనాలు లేని తాజా కొత్తిమీరను సులభంగా పెంచుకోవచ్చు.
-
వంటల్లో వాడే ధనియాలనే విత్తనాలుగా ఉపయోగించి 7–10 రోజుల్లో మొలకలు పొందవచ్చు.
-
పైభాగం ఆకులనే కోస్తే మొక్క మళ్లీ మళ్లీ పెరిగి ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది
హైదరాబాద్: వంట ఏదైనా సరే.. చివర్లో కొంచెం కొత్తిమీర పడితేనే ఆ రుచి, సువాసన వేరు. అయితే ప్రతిరోజూ మార్కెట్‌కు వెళ్లి కొత్తిమీర కొనడం, అది తాజాగా ఉంటుందో లేదో అని సందేహించడం కంటే, మన కళ్ల ముందే, మన ఇంట్లోనే దీనిని పెంచుకోవడం ఎంతో మేలు. పెద్దగా స్థలం లేకపోయినా, కేవలం ఒక చిన్న కుండీ లేదా కిటికీ దగ్గర ఉండే కొద్దిపాటి చోటుతోనే రసాయనాలు లేని స్వచ్ఛమైన కొత్తిమీరను ఎలా పండించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కొత్తిమీర పెంపకం:
కొత్తిమీర పెంచడానికి మరీ లోతైన కుండీలు అవసరం లేదు. 8 నుండి 10 అంగుళాల లోతు ఉంటే సరిపోతుంది. అయితే, కుండీ అడుగున నీరు బయటకు వెళ్లడానికి చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. సాధారణ మట్టిలో కొంచెం కంపోస్ట్ (సేంద్రియ ఎరువు) కలిపితే మొక్కలు బలంగా పెరుగుతాయి. ఈ మిశ్రమం మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది. మనం వంటల్లో వాడే ధనియాలనే విత్తనాలుగా వాడవచ్చు. ధనియాలను రెండు ముక్కలుగా అయ్యేలా చేత్తో మెల్లగా నలిపి, మట్టిలో అర అంగుళం లోతులో వేయాలి. పైన కొంచెం మట్టి కప్పి, తేలికగా నీళ్లు చల్లాలి. కొత్తిమీర మొక్కలకు రోజుకు 4 నుండి 6 గంటల సూర్యరశ్మి అవసరం. కానీ మరీ మండుటెండలో ఉంచకూడదు. మట్టి పైపొర ఎండినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
మొలకలు ఎప్పుడు వస్తాయి?
విత్తనాలు వేసిన 7 నుండి 10 రోజుల్లో చిన్న మొలకలు రావడం మొదలవుతుంది. ఈ దశలో కుండీని మాటిమాటికీ కదపకుండా ఒకే చోట ఉంచాలి.
జాగ్రత్తలు: మొక్క సుమారు 4 అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత ఆకులను కోయడం మొదలుపెట్టవచ్చు. ఒకేసారి మొత్తం మొక్కను పీకేయకుండా, పైభాగంలోని ఆకులను మాత్రమే కత్తిరిస్తే.. ఆ మొక్క మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ పురుగులు పడితే వేపనూనెను నీటిలో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది.
ఇంట్లో పండించిన కొత్తిమీర ఆరోగ్యకరమే కాకుండా వంటలకు అదనపు రుచిని ఇస్తుంది. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో తాజా కొత్తిమీరను పొందడానికి ఈ పద్ధతిని తప్పక ప్రయత్నించండి.