ఆ మంత్రుల‌కు షాక్ ఇవ్వ‌బోతున్న డీకే శివ‌కుమార్‌.. కేబినెట్‌లో కొత్త‌వారికే చోటు..!

క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి సిద్ధరామయ్య పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (cabinet reshuffle)పై దృష్టి సారించగా, సీనియర్ల స్థానంలో యువ నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Karnataka | కాంగ్రెస్ అధిష్టానం మధ్యవర్తిత్వంతో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం క‌ర్నాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సిద్ధ‌రామ‌య్య గురువారం రాజీనామా చేశారు. గౌరవప్రదంగా పదవి నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 64 ఏళ్ల శివకుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశంపై కాంగ్రెస్ హైక‌మాండ్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం తీసుకురావడంతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ‘కేరళ తరహా’ మోడల్‌ను పరిశీలిస్తూ.. అనుభవం ఉన్న సీనియర్లతో పాటు కొత్త ముఖాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా కేబినెట్ బెర్తులు కేటాయించ‌నున్న‌ట్లుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

Read Also : సీఎం ప‌ద‌వి సిద్ధ‌రామ‌య్య రాజీనామా.. సాధార‌ణ రైతు కుటుంబం నుంచి సీఎం ప‌ద‌వి వ‌ర‌కు ప్ర‌స్థానం ఇదే..!

ఈ మార్పుల నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు సీనియర్ మంత్రుల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్‌సీ మహదేవప్ప (73), ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ (76), హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర (74) వంటి సీనియ‌ర్ల బెర్తుల‌పై సమీక్ష జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన బైరతి సురేశ్, సంతోష్ లాడ్, దినేశ్ గుండూరావు, జమీర్ అహ్మద్ ఖాన్ వంటి నేతల పేర్లు కూడా పునర్వ్యవస్థీకరణ చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో సుమారు 15 మంది మంత్రులను కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఖాళీలను డీకే శివకుమార్ సూచనల మేరకు కొత్తగా ఎంపికయ్యే నేతలతో భర్తీ చేయాలని అధిష్టాన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనుభవం ఉన్నవారితో పాటు యువ నాయకత్వాన్ని కలిపి ప్రభుత్వాన్ని మరింత చురుకుగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ మార్పులు చేపడుతున్నట్లు సమాచారం.

Read Also : పెద్ద‌ల స‌భ‌కు వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ అధిష్టానం యోచ‌న‌..!

ఇక ఈ పరిణామాలు పార్టీలో మిశ్రమ స్పందనలు వ‌స్తున్నాయి. ప్రత్యేకంగా అహిందా వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనన్న ఆందోళన కొన్ని వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, గురువారం సిద్ధరామయ్య నిర్వహించిన అల్పాహార సమావేశంలో తన నిర్ణయాన్ని సహచరులకు తెలియజేయగానే పలువురు మంత్రులు భావోద్వేగానికి లోనైన‌ట్లు తెలిసింది. అయితే, పార్టీ ఐక్యతను దృష్టిలో ఉంచుకుని హైక‌మాండ్ నిర్ణయానికి కట్టుబడి సిద్ధరామయ్య తీసుకున్న వైఖరిపై రాజకీయ వర్గాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత స్థాయిలో త్యాగపూరిత నిర్ణయం తీసుకుని పార్టీకి స్పష్టమైన సందేశం ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తుది మంత్రివర్గ జాబితా ఖరారు కాకపోయినా.. అనుభవం, యువ సమ్మేళనంతో కొత్త కేబినెట్ రూపుదిద్దుకుంటుందని కాంగ్రెస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. శివకుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read Also : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించనున్న ప్రధాని.. జులై నుంచి సర్వీసులు షురూ..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »