సీఎం ప‌ద‌వి సిద్ధ‌రామ‌య్య రాజీనామా.. సాధార‌ణ రైతు కుటుంబం నుంచి సీఎం ప‌ద‌వి వ‌ర‌కు ప్ర‌స్థానం ఇదే..!

క‌న్న‌డ నాట రాజకీయాల్లో (Karnataka Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah Resignation) రాజీనామా చేయడంతో నాయకత్వ మార్పు (Leadership Change) స్పష్టమైంది. కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) సూచ‌న‌ల మేర‌కు డీకే శివకుమార్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

Siddaramaiah | క‌ర్నాట‌క రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. సీనియ‌ర్ నేతగా గుర్తింపు పొందిన ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య గురువారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న నాయకత్వ మార్పు ఊహాగానాలకు తెరపడింది. బెంగళూరులోని లోక్‌ భవన్‌లో గవర్నర్ కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మంత్రివర్గ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. అనంతరం డీకే శివకుమార్‌, హోంమంత్రి జీ పరమేశ్వరతో కలిసి మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. అధిష్టానం ఆదేశాల మేరకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

అధిష్టానం ఆదేశాల‌తోనే…

“గవర్నర్ ప్రస్తుతం బెంగళూరులో లేరు. ఆయన రాత్రికి తిరిగి వస్తారని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శికి నా రాజీనామా సమర్పించాను. పార్టీ అధిష్టానం ఎప్పుడైతే చెప్పుతుందో అప్పుడు రాజీనామా చేస్తానని నేను ఎప్పుడూ చెప్పాను. రెండు రోజుల క్రితం అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను” అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 78 ఏళ్ల సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన నేతగా గుర్తింపు పొందారు. ఒకటి కంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతల జాబితాలో ఆయన కూడా చేరారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేతల్లో ఒకరిగా నిలిచారు.

Read Also : పెద్ద‌ల స‌భ‌కు వైఎస్ ష‌ర్మిల‌.. కాంగ్రెస్ అధిష్టానం యోచ‌న‌..!

సాధార‌ణ రైతు కుటుంబం నుంచి..

1947 ఆగస్టులో మైసూరు జిల్లా సిద్ధరామనహుండి గ్రామంలో జన్మించిన సిద్ధరామయ్య సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. చిన్నతనంలో పశువులు మేపుతూ పెరిగిన ఆయన నేరుగా నాలుగో తరగతి నుంచి చదువు ప్రారంభించారు. అనంతరం న్యాయ విద్య పూర్తిచేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన తండ్రి సిద్ధరామే గౌడ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనుభవంతో రాజకీయాలపై జాగ్రత్తగా ఉండాలని కుమారుడికి సూచించినట్లు చెబుతుంటారు. అయితే, సిద్ధరామయ్య మాత్రం తాలూకా బోర్డు ఎన్నికల్లో విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య 12 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిది సార్లు విజయం సాధించారు. రాష్ట్ర బడ్జెట్‌ను 17 సార్లు ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది.

దేవెగౌడ‌కు శిష్యుడిగా..

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడను సిద్ధరామయ్య రాజకీయ గురువుగా భావిస్తారు. జనతాదళ్‌లో ఆయన ఎదుగుదలకు దేవెగౌడ కీలక పాత్ర పోషించారు. అయితే, తర్వాత భావజాల విభేదాలతో జనతాదళ్‌కు దూరమైన సిద్ధరామయ్య కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో సిద్ధరామయ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్గత రిజర్వేషన్లు, ప్రభుత్వ టెండర్లలో వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడం, అణగారిన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వడం వంటి నిర్ణయాలు ఆయన పాలనలో కీలకంగా నిలిచాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్ర‌భావం ఉన్నా కాంగ్రెస్ నుంచి ఆయ‌న ధీటుగా నిలిచి రాజ‌కీయంగా గుర్తింపు పొందారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కూడా ఆయన తరచూ విమర్శలు గుప్పించారు. అయితే, ప్రత్యర్థి పార్టీల నుంచి ‘అప్పీజ్మెంట్ రాజకీయాలు’ చేస్తున్నారన్న విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

Read Also : దశాబ్దంలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఏపీలో ప్రతాపం చూపుతున్న భానుడు..!

రాజ‌కీయ ప్ర‌యాణంలో మ‌లుపులు..

సిద్ధరామయ్య రాజకీయ ప్రయాణంలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. 1978లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1988లో ఎస్‌.ఆర్‌. బొమ్మై కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో దేవెగౌడ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య, 1996లో జేఎచ్‌ పటేల్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. 2005లో ‘అహిందా’ ఉద్యమాన్ని ప్రారంభించడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. అనంతరం జేడీఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఆయన 2006లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

2013లో తొలిసారి సీఎంగా..

2013లో క‌ర్నాట‌క ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్య, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. 2018 ఎన్నికల్లో బాదామి నుంచి విజయం సాధించిన ఆయన, కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2019లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా సిద్ధరామయ్య రాజీనామాతో క‌న్న‌డ రాజ‌కీయాలు కొత్త ద‌శ‌లోకి ప్ర‌వేశించాయి. ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డంతో అభిమానులు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయం ముగిసినట్లేన‌ని పేర్కొంటున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read Also : క‌న్న‌డ నాట మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. నేడు సీఎం ప‌ద‌వికి సిద్ధ‌రామ‌య్య రాజీనామా?

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »