Karnataka | కన్నడనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నాయకత్వ పోరుకు పార్టీ హైకమాండ్ తెరదించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అధిష్ఠానం సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద ఉన్నట్లు సమాచారం. వెనుకబడిన వర్గాలు, దళితుల మద్దతుతో ఏర్పడిన అహిందా ఓటు బ్యాంక్‌కు సిద్ధరామయ్య ప్రధాన ముఖచిత్రంగా ఉండటంతో ఆయన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత ఆరు నెలలుగా సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాల మధ్య సాగిన మాటల యుద్ధం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే స్థాయికి చేరుకోవడంతో కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం.
అధిష్టానం నిర్ణయానికి ఓకే చెప్పిన సీనియర్ నేతలు..
హోంమంత్రి జీ పరమేశ్వరతో పాటు సీనియర్ మంత్రులు సతీశ్ జార్కిహోళి, కేహెచ్ మునియప్ప వంటి దళిత నేతలు అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన మునియప్ప కూడా నాయకత్వ మార్పు జరిగితే దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌ను ముందుకు తేబోనని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు జరిగితే దళిత సీఎం అంశాన్ని ముందుకు తెచ్చి ఒత్తిడి పెంచాలన్న సిద్ధరామయ్య వర్గ వ్యూహానికి కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం ఉదయం సిద్ధరామయ్య గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం. రాజీనామాకు ముందు లేదా తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Read Also : పెద్దల సభకు వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అధిష్టానం యోచన..!
సంబరాల్లో డీకే అనుచరులు..
ఇదిలా ఉండగా.. బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఇప్పటికే అనుచరులు సంబరాల్లో మునిగిపోయినట్లు సమాచారం. మద్దతుదారులు బాణాసంచా కాలుస్తుండగా, పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే డీకే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్వీ దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిద్ధరామయ్య ఇప్పటికే రాజీనామా చేయాలని నిర్ణయించుకుని, హైకమాండ్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. డీకే శివకుమార్ స్థానంలో కొత్త కేపీసీసీ అధ్యక్షుడిని నియమించడం, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం వంటి ప్రతిపాదనలతో సిద్ధరామయ్య ఇటీవల ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో జరిగిన చర్చల్లో అధికార బదిలీ సాఫీగా జరిగేలా చూడాలని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఓటు బ్యాంకు దెబ్బతినకుండా..
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లు కూడా సిద్ధరామయ్యను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన సమయం వచ్చిందని వారు గుర్తుచేసినట్లు సమాచారం. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశం అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్ కలిసి మీడియా ముందుకు రావడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అహిందా ఓటు బ్యాంక్ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూనే సిద్ధరామయ్య స్వచ్ఛందంగా తప్పుకునేలా ఒప్పించినట్లు సమాచారం. లింగాయత, అహిందా, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్.. తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
వ్యూహాత్మక అడుగులు..
2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ నాయకత్వ మార్పును వ్యూహాత్మకంగా చూస్తున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య వయస్సుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి వ్యవస్థాపక పనులను సమర్థంగా నిర్వహించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య ఇప్పటికీ మంచి పరిపాలకుడిగా, తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే నేతగా గుర్తింపు పొందారు. అయితే, వయోభారంతో ఏర్పడిన వినికిడి సమస్యలు వంటి అంశాలు కూడా కాంగ్రెస్ పెద్దల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ-జేడీఎస్ కూటమి వైపు లింగాయత్, వొక్కలిగ ఓట్లు మళ్లుతున్నాయన్న ఆందోళన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌ను ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడంతో పాటు అహిందా ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలని, అదే సమయంలో వొక్కలిగ వర్గంలోనూ పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ సెటైర్లు..
అయితే, ఈ మార్పు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్థిరంగా కొనసాగుతుందన్నది సిద్ధరామయ్య వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయాలన్న ఆలోచన సిద్ధరామయ్యకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో కూడా రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగే అవకాశాలు లేకపోలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కన్నడనాట జరుగుతున్న తాజా పరిణామాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also : ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. నెల్లూరులో రూ.3వేలకోట్లకుపైగా ఐఎఫ్‌ఎఫ్ పెట్టుబడి..


