తెలంగాణలో ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన డిజిటల్ సేవలు అందించేందుకు మీ సేవ కేంద్రాలను ఆధునీకరించి మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ఆయన సమావేశమయ్యారు.
డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
AI, సైబర్ భద్రత, డేటా సెంటర్లపై చర్చ
సమావేశంలో రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
వాటిలో ప్రధానంగా…
- మీ సేవ కేంద్రాల ఆధునీకరణ
- భారత్ ఫ్యూచర్ సిటీలో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు
- కృత్రిమ మేధస్సు (AI) వినియోగం
- సైబర్ భద్రత బలోపేతం
- డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) అభివృద్ధి
- యువతకు ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణ
అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ డిజిటల్ సంస్కరణలకు ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు
రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. ప్రజా సేవల నాణ్యత పెంపు, డిజిటల్ సామర్థ్యాల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, డేటా గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రపంచ బ్యాంక్ సాంకేతిక సహకారం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
రూ.2,000 కోట్ల పెట్టుబడుల అవకాశాలు
దేశంలో డిజిటల్ రంగ పెట్టుబడులకు తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు అనుకూల వేదికలుగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRలు) సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.
టి-ఫైబర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
సమావేశం అనంతరం టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల విస్తరణ వంటి అంశాలపై అధికారులతో చర్చించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అంతేకాకుండా వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ, టి-ఫైబర్ ఎండీ, ఐటీ శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read: రోజూ 30 నిమిషాల నడక.. శరీరంలో జరిగే ఈ మార్పులు తెలిస్తే ఆగలేరు!


