తెలంగాణలో పెరిగిన ఎండలు | సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Telangana Temperature
Telangana Temperature

తెలంగాణలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇది ఎండాకాలమా.. శీతాకాలమా అన్నంతగా పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల మేర, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండ వేడి తగ్గడం లేదు. దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోత వాతావరణం కూడా కనిపిస్తోంది.

ఎల్‌నినో ప్రభావం రోజురోజుకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “యాక్చువల్‌గా మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే కూడా చాలా సఫర్ అవుతున్నాం. ఎండకు అసలు ఇది సమ్మరా, వింటరా కూడా అర్థం కావడం లేదు. వింటర్ స్టార్ట్ అయ్యి జస్ట్ ఫైవ్ డేస్ అయినా అసలు వింటర్ లెక్కనే లేదు. ఇది మొత్తం సమ్మర్ అనే ఫీలింగ్ వస్తుంది. బయటికి వెళ్లాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది మధ్యాహ్నం పూట” అని చెప్పారు.

ఇక నిత్యం ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా ప్రస్తుత వాతావరణంపై స్పందిస్తున్నారు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. “మాకైతే కామన్. ఎందుకంటే ఎండాకాలంలో కూడా మేము ఇదే విధంగా పని చేస్తాం. కాకపోతే అక్టోబర్, నవంబర్ మాసాల్లో చలికాలం లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు చలికాలం లాగా లేదు. మేము ఏదో ఎండాకాలంలో పని చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే ఇది ఎల్‌నినో ప్రభావం వల్లనే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఇయర్‌లో కూడా ఇదే విధంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు కొంతమంది చెబుతున్నారు. అది ఉంటుండొచ్చు” అని తెలిపారు.

“మేము దానికి అన్ని విధాలుగా అడ్జస్ట్ అయ్యే జాబ్ చేస్తున్నాం. విధి నిర్వహిస్తున్నప్పుడు దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎండ, వాన, చలి అనేది ఏమీ ఉండదు. విధి నిర్వహించాల్సిందే” అని చెప్పారు.

ప్రస్తుతం తీవ్ర ఎండలతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండ వేడి, మరోవైపు వాహనం నడుపుతున్న సమయంలో రోడ్డు నుంచి వెలువడే వేడి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు చలి వాతావరణం కనిపించడం లేదు. వేసవి కాలం ప్రారంభంలో ఉండే స్థాయిలో ప్రస్తుతం ఎండలు నమోదవుతున్నాయి.

రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండ, ఉక్కపోత కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »